యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా జోరు కొనసాగుతోంది. ఇప్పటికే తొలి టెస్టు గెలిచి ఊపు మీదున్న కంగారూ జట్టు.. రెండో టెస్టులోనూ ఇంగ్లాండ్‌ను ఓడించింది. 275 పరుగుల భారీ తేడాతో గెలిచి ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలోకి వెళ్లింది.
రెండో ఈ టెస్టులో ఆతిథ్య ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 9 వికెట్లకు 473 పరుగులు చేసింది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ లో 236 పరుగులు సాధించగా, రెండో ఇన్నింగ్స్ లో ఆసీస్ 9 వికెట్లకు 230 పరుగుల వద్ద డిక్లేర్ చేసి ఇంగ్లండ్ ముందు భారీ లక్ష్యాన్నుంచింది. అయితే ఏ దశలోనూ ఇంగ్లండ్ లక్ష్యాన్ని సమీపించేలా కనిపించలేదు.
బట్లర్ (26, 207 బంతుల్లో), వోక్స్ (44) ఆసీస్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నారు. కానీ జట్టుకు విజయాన్ని మాత్రం అందించలేకపోయారు. దీంతో 192 పరుగులకు ఆలౌటై ఆసీస్‌కు విజయాన్ని అప్పగించింది ఇంగ్లాండ్. ఆసీస్ బౌలర్లలో జే రిచర్డ్సన్ 5 వికెట్లతో సత్తాచాటాడు. ఈ విజయం అనంతరం 5 టెస్టుల సిరీస్ లో ఆస్ట్రేలియా 2-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇరుజట్ల మధ్య మూడో టెస్టు (బాక్సింగ్ డే టెస్టు) ఈ నెల 26 నుంచి మెల్బోర్న్ లో జరగనుంది.