పవన్ కల్యాణ్ కు తమ్ముళ్ల సవాల్..!

పవన్ కల్యాణ్ కు తమ్ముళ్ల సవాల్..!

0
143

పోరాటయాత్రలో భాగంగా ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్న జనసేనాని పవన్ కల్యాణ్.. స్థానిక సమస్యలను ప్రస్తావిస్తూ తెలుగుదేశం ప్రభుత్వంపై ఫైర్ అవుతున్నారు. సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని నిప్పులు చెరుగుతున్నారు. టీడీపీ హయాంలో విపరీతంగా అవినీతి పెరిగిపోయిందని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ నాయకులు సైతం జనసేనాని పై ఎదురుదాడికి దిగుతున్నారు. జనసేనానికి ధీటుగా కౌంటర్లు ఇవ్వడంతో పాటు ఛాలెంజ్ లు కూడా విసురుతున్నారు.

ఈ నేపథ్యంలో పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు టీడీపీ ఎమ్మెల్యే బడేటి కోట రామారావు (బుజ్జి) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తన నియోజకవర్గం నుంచి పోటీ చేసినా సరే, తానే గెలిచి తీరుతానని ధీమా వ్యక్తం చేశారాయన.

‘జనసేనాని పవన్‌ ఏలూరు నుంచి పోటీ చేసినా ఫర్వాలేదు. కచ్ఛితంగా నేనే గెలుస్తా. టీడీపీపై నిరాధారమైన ఆరోపణలు చేస్తూ పవన్‌ తన విలువ కోల్పోతున్నారు’ అని బుజ్జి మండిపడ్డారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని హితవు పలికారాయన.

మరోవైపు జనసేనాని తో పాటు వైసీపీ అధినేత జగన్ ను టీడీపీ నాయకులు టార్గెట్ చేస్తున్నారు. ఆ ఇద్దరి పై మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విమర్శలు గుప్పించారు. జగన్ దోపిడీదారుడైతే… ఏమాత్రం అనుభవం లేని వ్యక్తి పవన్ కల్యాణ్ అని విమర్శించారు. జగన్, పవన్ లను ప్రజలు నమ్మరని ఆయన అన్నారు. పరిపాలనలో ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి చంద్రబాబు అని… వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకే ప్రజలు పట్టం కడతారని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. ఏపీకి బీజేపీ తీరని అన్యాయం చేసిందని, ఆ పార్టీకి ప్రజలు బుద్ధి చెబుతారని ఆయన వ్యాఖ్యానించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా, ప్రజలు టీడీపీ వెంటే ఉంటారని మంత్రి తేల్చి చెప్పారు.