భారత ఫుట్‌బాల్ (Indian Football) భవిష్యత్తుకు ఇప్పటి నుంచే పునాదులు వేయాలని బొరుసియా డార్ట్మండ్ మాజీ ఆటగాడు మార్సెల్ ష్మెల్జర్ సూచించారు. 2031 అండర్-17 ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని యువ ఆటగాళ్లకు సరైన శిక్షణ అందించాలని చెప్పారు. చిన్న పిల్లలకు ప్రొఫెషనల్ ఆటగాళ్ల తరహాలో శిక్షణ ఇవ్వడం సరికాదని అభిప్రాయపడ్డారు. కొచ్చిలో నిర్వహించిన ఫుట్‌బాల్ క్లినిక్‌లో పాల్గొన్న ష్మెల్జర్.. భారత యువ ఆటగాళ్లకు పలు సూచనలు చేశారు. పాస్‌లు, డ్రిబ్లింగ్, బంతిపై నియంత్రణ, రెండు కాళ్లతో ఆడటం వంటి ప్రాథమిక నైపుణ్యాలపై దృష్టి పెట్టాలని చెప్పారు. ముఖ్యంగా 11 మందితో జరిగే మ్యాచ్‌ల కంటే 3v3, 4v4, 5v5 తరహా చిన్న ఆటలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.
దీనివల్ల ప్రతి ఆటగాడికి బంతితో ఎక్కువ సమయం గడిపే అవకాశం ఉంటుందని వివరించారు. 2031 ప్రపంచకప్‌లో ఆడే ఆటగాళ్లు ప్రస్తుతం 11, 12 ఏళ్ల వయసులో ఉన్నారని గుర్తుచేశారు. కాబట్టి ఇప్పటి నుంచే దశలవారీగా శిక్షణ ఇవ్వాలని సూచించారు. భారత్‌లో ఫుట్‌బాల్‌పై అభిమానుల ఆసక్తి బాగుందని ష్మెల్జర్ పేర్కొన్నారు. అయితే బుండెస్లిగాతో పోలిస్తే ప్రీమియర్ లీగ్‌కు ఇక్కడ ఎక్కువ ఆదరణ ఉందన్నారు. ఇంగ్లిష్ క్లబ్‌లు ఆసియాలో ముందుగానే పర్యటించడం, టెలివిజన్ ప్రసారాలకు ఎక్కువ ప్రాధాన్యం లభించడం ఇందుకు ప్రధాన కారణాలని వివరించారు.


