కాల్​ రికార్డింగ్స్ పై కొత్త రూల్స్..అవి ఏంటో తెలుసా!

0
96

కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ కాల్స్​, శాటిలైట్ ఫోన్ కాల్స్​, కాన్ఫరెన్స్ కాల్స్​, సాధారణ నెట్‌వర్క్‌లతో పాటు ఇంటర్నెట్‌లో పంపిన మెసేజ్​ల వివరాలను కనీసం రెండేళ్లపాటు భద్రపరచడాన్ని తప్పనిసరి చేసింది. గతంలో ఏడాది పాటే కాల్​ రికార్డింగ్​ డేటాను భద్రపరచగా..ఆ వ్యవధిని రెండేళ్లకు పెంచుతూ టెలికాం శాఖ (డాట్​) డిసెంబరులో ఏకీకృత లైసెన్స్​లో సవరణ చేసింది. టెలికాం ఆపరేటర్లకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది టెలికాం శాఖ.

నెట్​వర్క్​ నుంచి జరిగిన సంభాషణలకు సంబంధించి కమర్షియల్​ రికార్డ్స్​, కాల్​ వివరాల రికార్డ్​, ఎక్స్ఛేంజ్​ వివరాల రికార్డ్​, ఐపీ వివరాల రికార్డులను ప్రభుత్వ పరిశీలన కోసం రెండేళ్ల పాటు తప్పనిసరిగా భద్రపరచాలి.​ లైసెన్సర్​ నుంచి ఎలాంటి దిశానిర్దేశాలు అందకపోతే ఆ డేటాను తర్వాత డిలీట్​ చేయవచ్చు. వాయిస్​ మెయిల్స్​, ఆడియో టెక్స్​, యూనిఫైడ్ మెసేజింగ్​ సేవలకు ఈ నిబంధన వర్తిస్తుందని జనవరి 27న జారీ చేసిన ఉత్తర్వుల్లో కేంద్రం పేర్కొంది.

డాట్​ జనవరి 25న ఇంటర్నేషనల్ లాంగ్ డిస్టెన్స్(ఐఎల్​డీ) లైసెన్స్‌లో సవరణలు చేసింది. దీని ద్వారా కాల్ వివరాల రికార్డులను భద్రపరచడాన్ని ఒక ఏడాది పొడిగించడం సహా ఇంటర్నెట్ ప్రోటోకాల్‌ను ఉపయోగించి చేసిన అంతర్జాతీయ కమ్యూనికేషన్ల వివరాలను భద్రపరిచే వీలుంటుంది. ఈ లైసెన్సులు​ పొందిన టాటా కమ్యూనికేషన్స్​, సిస్కోస్​ వెబెక్స్​, ఏటీ అండ్​ టీ గ్లోబల్​ నెట్‌వర్క్​ తదితర కంపెనీలకు కూడా ఈ సవరణ వర్తిస్తుంది.