టీమిండియా చేతిలో ఇంగ్లాండ్ చావుదెబ్బ

టీమిండియా చేతిలో ఇంగ్లాండ్ చావుదెబ్బ

0
90

చివరిసారిగా ఇంగ్లాండ్ లో పర్యటించినపుడు ఘోర పరాభవాన్ని చవిచూసిన టీమిండియా ఈ సారైనా ఆశించిన స్థాయిలో రాణిస్తుందా? అన్న ప్రశ్నకు సమాధానం చాలా ఘాటుగా చెప్పింది. ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా ప్రారంభమైన తొలి టీ20 మ్యాచ్ లో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించి సొంతగడ్డపై ఇంగ్లాండ్ కు ఓటమి రుచి చూపించింది.

ఇటీవల ముగిసిన ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్ లో అద్భుతమైన ప్రదర్శనను ఇచ్చి, హాట్ ఫేవరేట్ గా బరిలోకి ఆతిధ్య ఇంగ్లాండ్ జట్టు టీమిండియా ముందు తల వంచక తప్పలేదు. టాస్ గెలిచిన విరాట్ కోహ్లి బౌలింగ్ ఎంచుకోగా, ఆసీస్ మాదిరే టీమిండియా పైన కూడా విరుచుకుపడాలని నిర్ణయించుకున్న బ్యాట్స్ మెన్లు తొలి 5 ఓవర్లలో విజయవంతంగా దానిని అమలు పరిచారు.

అయితే ఆ తర్వాత భారత బౌలర్లు రాణించడంతో కట్టడి అయిన ఇంగ్లాండ్ మిడిల్ ఆర్డర్ ను కులదీప్ యాదవ్ కుప్పకూల్చాడు. ఒక్క ఓవర్లోనే ముగ్గురు ప్రధాన బ్యాట్స్ మెన్లను పెవిలియన్ పంపి భారీ స్కోర్ దిశగా నడుస్తోన్న ఇంగ్లాండ్ ను డిఫెన్స్ లో పడేసాడు. ఇక అక్కడ నుండి కోలుకోవడం ఇంగ్లాండ్ వల్ల కాలేదు. మొత్తమ్మీద తన 4 ఓవర్లలో 24 పరుగులిచ్చి 5 వికెట్లను సొంతం చేసుకున్నాడు కులదీప్.

160 పరుగుల లక్ష్య చేధనతో బ్యాటింగ్ ఆరంభించిన టీమిండియా తొలి ఓవర్లోనే శిఖర్ ధావన్ వికెట్ ను కోల్పోయినప్పటికీ, వన్ డౌన్ లో వచ్చిన కే ఎల్ రాహుల్ ఇంగ్లాండ్ బౌలింగ్ ను తుత్తునీయలు చేస్తూ టీమిండియాకు తిరుగులేని విజయాన్ని అందించాడు. కేవలం 54 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్సర్లతో అజేయమైన 101 పరుగులు చేసి ఆతిధ్య జట్టుకు మరో అవకాశం ఇవ్వకుండా మ్యాచ్ ను ముగించాడు.

రాహుల్ బ్యాటింగ్ ప్రతిభకు 18.2 ఓవర్లలోనే టీమిండియా లక్ష్యాన్ని అందుకుంది. మరో ఎండ్ లో రోహిత్ శర్మ 32 పరుగులతో సహకారం అందించాడు. బౌలింగ్ లో కులదీప్, బ్యాటింగ్ లో రాహుల్ లు అద్భుతంగా రాణించడంతో ఇంగ్లాండ్ గడ్డపై టీమిండియా తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. టీ20 చరిత్రలో 5 వికెట్లు సొంతం చేసుకున్న తొలి లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ గా కులదీప్ చరిత్ర సృష్టించాడు.