అనంతపురం, జూలై 10: రాష్ట్రంలో వెనుకబడిన, కరవు జిల్లాల అభివృద్ధికి నిధులిచ్చి ఆదుకుంటామంటూ ఇచ్చిన హామీని కేంద్రం విస్మరించడాన్ని నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఈనెల 11న అనంతపురం నగరంలో ధర్మ పోరాట దీక్ష చేపట్టనున్నారు.
నగరంలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో బుధవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ దీక్ష కొనసాగనుంది. ఇందుకోసం పార్టీ జిల్లా నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. అధికార పార్టీకి చెందిన 19 మంది ఎంపీలు, జిల్లా ఇన్‌చార్జి మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, జిల్లా మంత్రులు కాలవ శ్రీనివాసులు, పరిటాల సునీత, చీఫ్ విప్ పల్లె రఘునాథరెడ్డి, మండలి విప్ పయ్యావుల కేశవ్, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర, జిల్లా స్థాయి నేతలు భారీ ఎత్తున పాల్గొంటున్నారు. జిల్లా వ్యాప్తంగా 14 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని నేతలు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల నాయకులు, సభ్యులను వేలాదిగా తరలించేందుకు జిల్లా పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో అనంతపురంలో ప్రధాన రహదారులు, ముఖ్య కూడళ్లు, ప్రదేశాల్లో పెద్ద ఎత్తున పార్టీ జెండాలు ఏర్పాటు చేయడంతో నగరం పసుపుమయంగా మారింది. మంత్రి కాలవ శ్రీనివాసులు, జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే బీకే.పార్థసారథి, చీఫ్ విప్ పల్లె రఘునాథరెడ్డి దీక్ష ఏర్పాట్లను మంగళవారం పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి కాలవ శ్రీనివాసులు విలేఖరులతో మాట్లాడుతూ ఇతర రాష్ట్రాలతో పోలిస్తే, ఏపీ విషయంలో కేంద్ర ప్రభుత్వం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఇప్పటికే రాష్ట్రంలో పలు అభివృద్ధి పనులకు ఇచ్చిన నిధుల్ని వెనక్కు తీసుకుంటోందని, ఈ విధానాన్ని ధర్మ పోరాట దీక్షలో ఎండగడతామని అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలు నెరవేర్చకుండా ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు. అలాగే వెనుకబడిన 9 జిల్లాల్లో రాయలసీమలోని అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు, ఉత్తరాంధ్రలోని విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలను ఆదుకుంటామని కేంద్రం స్పష్టమైన హామీ ఇచ్చిందన్నారు. అక్కడి ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి, ఆ ప్రాంతాల్లో వసతులు పెంచడానికి ప్రత్యేక ఆర్థిక సాయం అందిస్తామని చెప్పిందన్నారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌తో పాటు ఆ రాష్ట్రాల మధ్య విస్తరించిన వెనుకబడిన బుందేల్‌ఖండ్‌కు ఇస్తున్న నిధుల తరహాలో ఏపీకి రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్‌కు రూ.3,506 కోట్లు, మధ్యప్రదేశ్‌కు రూ.3,760 కోట్లు, బుందేల్‌ఖండ్‌కు రూ.2,266 కోట్లు ప్రకటించిందని, ఈ లెక్కన సుమారు రూ.7000 కోట్ల పైచిలుకు నిధుల్ని ప్రకటించి ఇస్తోందన్నారు.
ఈ క్రమంలో అక్కడి ప్రజలకు తలసరి సాయంగా రూ.4,250 ఇస్తుండగా, ఏపీలో కేవలం రూ.450 కూడా ఇవ్వకపోవడం దారుణమన్నారు. అలాగే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వక పోవడం, విభజన చట్టంలోని హామీలు నెరవేర్చకపోవడంతో పాటు కడప ఉక్కు, విశాఖకు రైల్వే జోన్, ప్రాజెక్టులకు నిధులు వంటి వాటిలో కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంపై పక్షపాతం చూపుతోందన్నారు.
చిత్రం..అనంతపురం నగరంలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో బుధవారం జరుగనున్న ధర్మ పోరాట దీక్ష ఏర్పాట్లను పరిశీలిస్తున్న మంత్రి కాలవ శ్రీనివాసులు, ఎమ్మెల్యే పార్థసారథి