Alltimereport : ఆధ్యాత్మికత, ప్రేమ, భక్తి, సంప్రదాయాలపై బీజేపీ, ఆర్ఎస్ఎస్‌కు కనీసం అవగాహన లేదంటూ రాహల్ గాంధీ (Rahul Gandhi) ఘాటు విమర్శలు చేశారు. ఇదే అంశంపై రాహుల్ చేసిన పోస్ట్ ఇప్పుడు తీవ్ర చర్చలకు దారితీస్తోంది. శివుడు-పార్వతి అర్ధనారీశ్వర రూపంలోని శిల్పాన్ని ఆయన పంచుకున్నారు. భారతీయ ఆధ్యాత్మిక, మత సంప్రదాయాలను లోతుగా తెలుసుకుంటున్న కొద్దీ బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలపై తన అభిప్రాయం మరింత స్పష్టమవుతోందని రాహుల్ పేర్కొన్నారు. వారు కులవివక్ష, పురుషాధిక్య భావజాలంతో ఉన్నారని, ప్రేమ, ఆధ్యాత్మిక సంప్రదాయాల గొప్పతనాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారని విమర్శించారు.
ఇటీవల తన తల్లి సోనియా గాంధీ (Sonia Gandhi) జ్ఞాపకాల పుస్తకం ‘బిలోంగింగ్: ఏ జర్నీ ఆఫ్ లవ్’ ఆవిష్కరణలో రాహుల్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి కారణమయ్యాయి. చిన్నప్పుడు భోజనం చేసే సమయంలో తన తల్లి తండ్రి ఒడిలో కూర్చునేవారని, అది సహజమైన విషయమని భావించేవాడినని ఆయన చెప్పారు. స్నేహితుల ఇళ్లకు వెళ్లినప్పుడు వారి తల్లిదండ్రులు అలా లేకపోవడంపై ఆశ్చర్యపోయేవాడినని గుర్తుచేసుకున్నారు.
ఆ తర్వాత తమ కుటుంబంలో వచ్చిన మార్పులు, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీల హత్యలు తమను తీవ్రంగా దెబ్బతీశాయని వివరించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు విమర్శలు గుప్పించారు. అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ కూడా రాహుల్‌పై సెటైర్లు వేశారు. సోనియా గాంధీ పుస్తక ఆవిష్కరణ వంటి ప్రత్యేక సందర్భంలోనూ ఆమెకు ఇబ్బందికర పరిస్థితి కల్పించారని వ్యాఖ్యానించారు.
ఈ విమర్శలకు స్పందనగా రాహుల్ ప్రేమ, ఆప్యాయత అంశాన్ని తెరపైకి తెచ్చారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ (BJP – RSS) మద్దతుదారుల మనసుల్లో భయం, కోపం, ద్వేషం పేరుకుపోయాయని, అవే ప్రేమను వ్యక్తం చేయకుండా అడ్డుకుంటున్నాయని పేర్కొన్నారు. వారిని ఆ భావాల నుంచి బయటకు తీసుకురావడం నిజమైన హిందువుగా తన బాధ్యతని తెలిపారు. గతంలో పార్వతి శివుడి ఒడిలో కూర్చున్నట్లు ఉన్న 12వ శతాబ్దపు ఆలయ శిల్పాన్ని కూడా పంచుకున్నారు.
ఇప్పుడు అర్ధనారీశ్వరుడి రూపాన్ని ప్రస్తావించడం ద్వారా శివుడు, పార్వతి ఏకరూపంలోని ఆధ్యాత్మిక భావనను తన వాదనకు ముడిపెట్టారు. ప్రేమను దాచాల్సిన అవసరం లేదని, ఆప్యాయత బలహీనత కాదని, భాగస్వామిని సమానంగా చూడటమే సమానత్వానికి పునాది అని కాంగ్రెస్ కూడా రాహుల్(Rahul Gandhi)కు మద్దతుగా నిలిచింది.
Also Read : భారత్ ఎదుగుదలకు చైనా అడ్డంకులు.. అమెరికా హెచ్చరిక!
Follow Us On: Whatsapp


