హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ చదువుతున్న ఓ విద్యార్థిని ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది . రోజంతా బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన స్నేహితులు సెక్యూరిటీ సిబ్బందికి సమాచారం అందించారు . ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించి గచ్చిబౌలి పోలీసులకు సమాచారం అందించారు . సీఐ సురేష్ , హెచ్ సీయూ విద్యార్థులు తెలిపిన ప్రకారం..పెద్దపల్లి జిల్లా తారేపల్లికి చెందిన ఆర్.మౌనిక ( 27 ) హెచ్ సీయూలో నానో సైన్స్ ఎంఎస్ సీ రెండవ సంవత్సరం చదువుతోంది .
లేడీస్ హాస్టల్ ఎల్హెచ్ -7 లోని రూమ్ నెంబర్ 24 లో ఉంటోంది . ఆదివారం రాత్రి నిద్రకు ఉపక్రమించిన ఆమె సోమవారం ఉదయం నుంచి డోర్ తెరవలేదు . స్నేహితులు ఫోన్ చేసినా స్పందించ లేదు . దీంతో తోటి విద్యార్థులు రాత్రి 7.55 గంటలకు సెక్యూరిటీ సిబ్బందికి సమాచారం అందించారు . వారు డోర్ పగుల గొట్టి చూడగా కిటికీకి ఉరివేసుకొని కన్పించింది .
వెంటనే గచ్చిబౌలి పోలీసులకు సమాచారం అందించారు . సీఐ సురేష్ , ఎస్ఏలు శ్రీశైలం , వెంకట్ రెడ్డిలు ఘటనా స్థలాన్ని పరిశీలించారు . ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదని పోలీసులు చెబుతున్నారు . రెండు రోజుల క్రితం తల్లిదండ్రులు మౌనికకు ఫోన్ చేసి పెళ్లి సంబంధాలు చూస్తున్నామని చెప్పినట్లుగా తోటి విద్యార్థినుల ద్వారా తెలిసింది . కాగా మౌనిక ఆత్మహత్య విషయం తెలిసి క్యాంపస్ లోని వందలాది మంది హాస్టల్ వద్దకు చేరుకున్నారు . విద్యార్థులను అదుపు చేసి మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు . కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు .